ఏపీలో పొత్తుల గోల..!!

 

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేసాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకుంటే, బీజేపీ నమ్మించి మోసం చేసిందంటూ టీడీపీ, బీజేపీ కి దూరమైంది.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది.. ఇక జనసేన కూడా టీడీపీ పాలన సంతృప్తికరంగా లేదంటూ టీడీపీకి దూరమైంది.. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అని ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి.

 

 

ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమైందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కొందరు ఈ పొత్తుని తప్పుపడుతున్నారు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ, అలాంటిది ఇప్పుడదే కాంగ్రెస్ తో ఎలా కలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీనికి ధీటైన సమాధానం చెప్తున్నాయి.. టీడీపీ, తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి పుట్టిన పార్టీ.. అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ మీద పోరాడం.. ఇప్పుడు విభజన హామీల విషయంలో బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి బీజేపీ మీద పోరాడుతున్నాం అంటున్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి.. ప్రధాన జాతీయ పార్టీలు ఉంది రెండు బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తానంటుంది.. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై తుది నిర్ణయం మాత్రం చంద్రబాబుదే అని స్పష్టం చేస్తున్నారు.. రాజకీయాల విశ్లేషకులు మాత్రం ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకు లాభమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ కు, టీడీపీ ఓటు బ్యాంకు కూడా తోడైతే అధికారంలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది.. అలాగే విభజన అనంతరం ఏపీలో ఒక్క సీట్ గెలవని కాంగ్రెస్ ఇప్పుడు కాస్త బలపడింది.. గత ఎన్నికల్లో 7 లక్షలు ఓట్లు సాధించిన కాంగ్రెస్, ఈ సారి 15 నుండి 20 లక్షల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇది టీడీపీకి ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల భావన.

 

 

మరోవైపు బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి.. వైసీపీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తరువాత కానీ బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి.. అయితే దీన్ని మూడు పార్టీలు ఖండిస్తున్నాయి.. కానీ కొందరు నేతలు మాత్రం పొత్తు గురించి సంకేతాలు ఇస్తున్నారు.. గతంలో, పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ కి మద్దతిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసారు.. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పిన వరప్రసాద్.. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. దీనిబట్టి చూస్తుంటే పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి అసలు ఈ పొత్తుల గోల మీద క్లారిటీ రావాలంటే ఎన్నికల సమయం రావాల్సిందే.