TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతకంతకు బదులు తీర్చుకుంటాం... జగన్ సర్కారుకు టీడీపీ వార్నింగ్

Published on: Sat Sep 28, 2019 10:30AM

కోడెల శివప్రసాద్ మాదిరిగానే, చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ సర్కారు కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్‌-జైల్లో చింతమనేనిని పరామర్శించిన తెలుగుదేశం లీడర్లు...వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకంతకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

ప్రతిపక్షాన్ని అణగదొక్కేవిధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కావాలనే, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించామని, ఇలా ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు. కోడెల శివప్రసాద్ మాదిరిగానే, చింతమనేని ప్రభాకర్‌ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం కేసులతో వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. జగన్ సర్కారు వేధింపులపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.

పశ్చిమగోదావరి ఎస్పీ నవదీప్‌‌సింగ్‌ను కలిసిన టీడీపీ నేతలు... చింతమనేనిపై పెట్టిన అక్రమ కేసులపై మెమొరాండం ఇచ్చారు. ఇరుపక్షాలను విచారణ చేసిన తర్వాతే కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదే తరహాలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే, ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.