నారావారి కోటకు బీటలు పెడుతున్న జగన్
Published on: Thu May 3, 2012 9:46AM
తెలుగుదేశంపార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. మరికొందరు సీనియర్లు కూడా అదే బాట పట్టడంతో చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ వలసలు నిరోధించేందుకు, ఉప ఎన్నికలపై వ్యాహాన్ని చర్చించేందుకు ఆయన నాలుగో తేదీన పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణాలో చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండుకళ్ళ సిద్ధాంతం దారుణంగా విఫలమైంది. ఆ ప్రాంతంలోని పది జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది.
ఇది చాలదన్నట్లు తెలంగాణా ప్రాంతంలోని ముఖ్యనాయకులతో పాటు ఆంధ్రా, రాయలసీమలోని సీనియర్లు కూడా వలస బాటను పడుతున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ నేత సాంబారి తమ్మారావు టిడిపి విధానాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో తమ్మారావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు టిడిపికి గుడ్ బై చెప్పి జగన్ పంచన చేరారు. ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి గొట్టిపాటి హనుమంతరావు తనయుడు నర్సయ్య కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరారు.
పార్టీ సీనియర్లు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా త్వరలో తెలుగుదేశంపార్టీని వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యురాలు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఉప్పులేటి కల్పన కూడా అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో ఆమె కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విజయవాడ అర్బన్ టిడిపి అధ్యక్షుడు వల్లభనేని వంశీ విజయవాడలో జగన్ ను రోడ్డుపై కలుసుకుని బహిరంగంగా ఆలింగనం చేసుకోవడం తెలుగుదేశంపార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. జగన్ ను కలుసుకున్నందుకు వంశీకి పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. గుడివాడ శాసనసబ్యుడు, హరికృష్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని పార్టీ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు దురుద్దేశ్యంతో హరికృష్ణను పార్టీ వ్యవహారాల నుంచి ప్రక్కన పెడుతున్నారని కొడాలి నాని ఆరోపిస్తున్నారు.
నందమూరి వంశానికి చెందిన పురందీశ్వారి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రిగా ఉన్నారు. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హరికృష్ణను మరింత రెచ్చగొడితే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి దూరమైపోవచ్చునని ఆ పార్టీ నాయకులు కలవర పడుతున్నారు. ఈ పరిణామాలతో తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర కలవరానికి గురవుతున్నట్లు తెలిసింది.


