ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు.

దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి.

దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది.

దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.