కోడెల మృతికి వైసీపీ వేధింపులే కారణం.. జగన్ కంటే వైఎస్ నయం!!

 

అధికార పార్టీ వైసీపీ రాజకీయ వేధింపుల కారణంగానే టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కోడెల మృతిపై పలువురు టీడీపీ నేతలు స్పందిస్తూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మృతి చెందారని ఆరోపించారు. కోడెల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జగన్ ప్రభుత్వం వైఎస్ కంటే ఎక్కువగా వేధిస్తోందని కోడెల ఆవేదన చెందారని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని, కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని, టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని వైసీపీ నేతలకు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారని అన్నారు. కోడెల చనిపోయే వరకూ వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా చట్టాలు, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని.. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని, అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రాజకీయదాడి అయినా జరిగిందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాజకీయ వేధింపులకు కోడెల బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కోడెలది ఆత్మహత్య కాదని, ఆయనను సీఎం జగన్ దారుణంగా హత్యచేశారని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కాగా టీడీపీ వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ కూడా లేకుండా టీడీపీ నేతలు తమపై బురదజల్లుతారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని టీడీపీ నేతలకు శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.