ఇక మా సత్తా చూపిస్తాం...

 

ఇంతకాలం గొలుసులతో కట్టేసినట్టుగా కదల్లేకుండా వున్న టీడీపీ క్యాడర్ ఇక రెచ్చిపోబోతోంది.. ఇంతకాలం తమను సూటిపోటి మాటలతో హింసించిన బీజేపీ నాయకుల చెవుల్లో తుప్పు వదిలిపోయేలా చేయడానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధమవుతున్నారు. మాటకు మాట చెప్పడానికి, వాళ్ళ స్థాయి ఏమిటో వాళ్ళకి అర్థం అయ్యేలా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకాలం భరించిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆకలిగొన్న సింహాల్లా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కటీఫ్ చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సరైన సమయంతో తీసుకున్న సరైన నిర్ణయంగా టీడీపీ కేడర్ భావిస్తోంది. కాస్కోండి బీజేపీ నాయకుల్లారా... టీడీపీ సింహాలు వేటకు దిగబోతున్నాయి.

 

నాలుగేళ్ళ క్రితం టీడీపీ, బీజేపీ మధ్య స్నేహం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌ని అడ్డదిడ్డంగా విభజించడానికి ఒక కారణమైనప్పటికీ బీజేపీతో స్నేహం చేయడానికి ముందుకు వచ్చింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తే బాగానే వుండేది. అయితే మధ్యలో బీజేపీకి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలన్న అత్యాశ మొదలైంది. అసలు ఏపీలో బీజేపీ ముఖం చూసేవాళ్ళే లేరు. అయినప్పటికీ టీడీపీతో స్నేహం చేసినందుకు జనం ఓట్లేశారు. ఆ వాస్తవాన్ని తెలుసుకోలేని బీజేపీ నాయకులు వాపునే బలుపని అనుకుంటూ, తమకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సత్తా వుందని భ్రమపడింది. అప్పటి నుంచి టీడీపీ మీద బీజేపీ నాయకులు బాహాటంగా విమర్శలు చేస్తూ వచ్చారు. వాళ్ళ విమర్శలకు హద్దూపొద్దూ లేకుండా పోయింది. బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు పరిధిని దాటుతున్నాయని టీడీపీ క్యాడర్ బాధపడింది. వారిమీద ఎదురుదాడిచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబును గత కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు. అయితే ఓర్పు వహిస్తున్న చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకుల మీద విమర్శలకు దిగవద్దని క్యాడర్ని వారిస్తూ వస్తున్నారు. ఇక బీజేపీకి చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పడంతో టీడీపీ క్యాడర్ ఇక రెచ్చిపోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న బలమైన టీడీపీ కేడర్ని ఎదురొడ్డి నిలిచే సత్తా బీజేపీకి లేదు. ఇక వారు కూడా గతంలో మాదిరిగా నోటికొచ్చినట్టు మాట్లాడి నెగ్గే పరిస్థితి లేదు.