TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి పెద్ది రెడ్డికి వర్ల లేఖాస్త్రం: ఇసుక అక్రమ రవాణాపై చర్యలకు డిమాండ్

Published on: Sat May 14, 2022 11:17AM

వైసీపీ నేతల ఇసుక మాఫియాకు అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు గత కొంత కాలంగా వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై హత్యా యత్నాలూ, దాడులూ సర్వ సాధారణమైపోయాయి. తాజాగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరణి నదిలో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య లేఖాస్త్రం సంధించారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని పేర్కొన్న వర్ల, ఆరణి నదిలో అక్రమంగా తవ్విన ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా సహజ వనరులకు తీవ్రనష్టం జరుగుతోందని వర్ల ఆరోపించారు. 

ఒకే వే బిల్లుపై అనేక మార్లు ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారని, స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని, అందుకే  అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆ లేఖలో విమర్శలు గుప్పించారు. ఇసుక అక్రమ తవ్వకాలతో నది గమనంలో మార్పు వస్తోందని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  అరణి నది ఒడ్డు గ్రామాలకు తీవ్ర వరద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

భవిష్యత్ తరాలకు సహజ వనరులను రక్షించాలంటే అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలని వర్ల రామయ్య తన లేఖలో డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని వర్ల రామయ్య తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులపైన, ఇసుక మాఫియా పైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డిని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.