విజయవాడ టీడీపీలో విచ్ఛిన్నకర శక్తులు.. సీనియర్ నేత సెన్సేషనల్ కామెంట్స్ 

ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు గాను అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురామ్ తొలి సారిగా మాట్లాడుతూ కృష్ణా జిల్లా టీడీపీ కంచుకోట అని, అయితే కొన్ని కారణాలతో పార్టీ బలహీన పడిందని.. మళ్లీ కృష్ణా జిల్లాలో పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. తాను ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని నెట్టెం రఘురామ్ అన్నారు. పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని దీంతో పార్టీ కొంత దెబ్బతిందని ఆయన సెన్సేషనల్ కామెంట్ చేశారు. 2024లో కానీ లేదా ఇంకా ముందుగానే ఎన్నికలు జరిగినా విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీని గెలిపించుకుంటామని నెట్టెం రఘురామ్ స్పష్టం చేసారు. విజయవాడ పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాలపై తనకు పూర్తి అవగాహన ఉందని త్వరలో 7 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు వంచించబడ్డారని అయన వివరించారు. టీడీపీ వచ్చాకే ఏపీలో అభివృద్ధి అనే విప్లవం వచ్చిందని రఘురామ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 

విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన నెట్టెం రఘురామ్ వస్తూనే పార్టీలో కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని.. దీంతోనే పార్టీ దెబ్బతిందని ఆయన కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ టీడీపీలో పలు గ్రూపులు ఉన్నాయని.. వారిని టార్గెట్ చేస్తూ నెట్టెం రఘురామ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డ నెట్టెం రఘురామ్ కొంతమంది నేతలను టార్గెట్ చేసినట్టుగా వ్యాఖ్యలు చేయడంతో.. అసలు ఆయన నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళతారా లేదా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.