బీజీపీలో చేరుతున్నా....రాయపాటి సంచలనం !

 

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించిన కమలనాథులు పలు పార్టీల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలనే టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి బీజేపీ రూపంలో మరో కొత్త సమస్య ఎదురయ్యింది. ఇప్పటికే పలువురు బీజేపీలో చేరగా మరికొందరు కాషాయం కప్పుకోడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.ఈ విషయాన్ని ఆయన ఖరారు చేశారు. ఈరోజు తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకున్న ఆయన త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించారు. 

అయితే బీజేపీలో చేరతానని చెబుతూనే ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదని వారితో మాట్లాడక ఆ వివరాలు ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. నిజానికి సాంబశివరావును బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రముఖులు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ గుంటూరులోని రాయపాటి నివాసానికి వచ్చి ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ విషయం చంద్రబాబుకి చెప్పిన ఆయన వ్యాపార కారణాల రీత్యా పార్టీ మారుతున్నట్టు చెప్పారు. అయితే ఈయన పార్టీ మారినా ఈయన కుమారుడు రంగారావు మాత్రం తెలుగుదేశంలోనే కొనసాగుతారట.