TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొలి పరీక్ష డిస్టింక్షన్ లో పాస్ అయిన కూటమి సర్కార్!

Published on: Tue Mar 4, 2025 9:25AM

గత ఏడాది జరిగిన ఎన్నికలలో అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయ్యింది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం తొలి పరీక్షను ఎదుర్కొంది. అదే గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎనిమిది నెలల చంద్రబాబు ప్రభుత్వ పని తీరుకు ఈ ఎన్నికలు ఒక రిఫరెండంగా పరిశీలకులు అభివర్ణించారు. 

పాలనా పరంగా గత జగన్ ప్రభుత్వం కంటే వేయి రెట్టు మేలు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నా, పరీక్షల వాయిదా విషయంలో గ్యాడ్యుయేట్లలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోందన్న వార్తల నేపథ్యంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తెలుగుదేశం కూటమిలో ఒకింత టెన్షన్ కనిపించిన మాట వాస్తవం. అలాగే ప్రభుత్వం ఏర్పడి ఇంత కాలమైనా, వైసీపీ హయాంలో అడ్డగొలుగా వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యల విషయంలో బాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందన్న అసంతృప్తి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పడుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించారు. ముఖ్యంగా జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ క్యాడర్ లో అంసతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. 
వీటన్నిటికీ మించి గత ఏడాది ఎన్నికలలో ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో తెలుగు దేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలలో వైసీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు. 
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అదే స్థాయి విజయం సొంతం కావడంతో తెలుగుదేశం తొలి పరీక్షలో డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 

కృష్ణా, గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ, వామపక్షాల మద్దతు ఉన్నప్పటికీ ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ రావు ఏ దశలోనూ ఆలపాటికి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఒక్క రౌండ్ లో కూడా మెజారిటీ సాధించలేకపోయారు. అదే విధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుపై సునాయాస విజయం సాధించారు.  మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కు ప్రజామద్దతు బలంగా ఉందన్న విషయాన్ని తేల్చిచెప్పాయి. అంతే కాకుండా వైసీపీకి అంతంత మాత్రంగా ఉన్న స్థైర్యాన్ని కూడా పోయేలా చేశాయి.