TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మున్సిపోల్స్ లో  ఓడి గెలిచిన టీడీపీ.. శభాష్ తమ్ముళ్లు 

Published on: Wed Nov 17, 2021 4:49PM

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు కోట కుప్పంలోనూ పాగా వేసింది. పెనుగోండలో ఫ్యాన్ గాలి వీచింది. అయితే మినీ లోకల్ వార్ లో వైసీపీ గెలిచినా... టీడీపీకి ఊరట దక్కిందనే అంచనాలే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.

మినీ లోకల్ వార్ లో టీడీపీకి  గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు పూర్తి స్థాయిలో జరిగిన మున్సిపల్ , పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో చెప్పుకోవడానికి కూడా సరైన ఫలితాలు రాలేదు. కానీ మినీ లోకల్ వార్‌లో మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని నగర పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. 

దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలు ఉన్న కుప్పంలో  మొత్తం 25 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క డివిజన్ కూడా టీడీపీకి రాలేదు. పెనుకొండ, బుచ్చి నగర పంచాయతీల్లో రెండు చోట్ల వార్డు సభ్యులు గెలిచారు. మిగిలిన చోట్ల టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. అసలు టీడీపీకి నాయకుడే లేని నియోజకవర్గం అయిన దర్శి నగర పంచాయతీని టీడీపీ గెల్చుకుంది. అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అందరూ వైసీపీలోనే ఉన్నారు. అయినా టీడీపీ గెలిచింది. 

పోటీ చేయడానికే టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురైన దాచేపల్లిలో హోరాహోరీ పోరు జరిగింది. కొద్దిలో టీడీపీ విజయం మిస్ అయింది. ఇక కృష్ణా జిల్లాలోని కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో  ఫలితాలే సాధించారు. గుంటూరులో ఆరో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ గెలిచింది. వైసీపీ నేతలు తాడో పేడో అన్నట్లుగా తీసుకుని పెద్ద ఎత్తున ఖర్చుకు వెనుకాడని చోట వైసీపీ విజయాలు సాధించింది. అలా కాకుండా లైట్‌ తీసుకున్న చోట టీడీపీ విజయం సాధించింది.

మినీ లోకల్ వార్ ఫలితాలు టీడీపీ నేతల్లో కాస్త ఆశలు నింపుతున్నాయి. ఇన్ని నిర్బంధాలు.. ఎలాంటి వనరులు లేని పరిస్థితుల్లోనూ టీడీపీకి ఈ మాత్రం ఓట్లు రావడం వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ పతనానికి ఇది నాంది అని అంటున్నారు తమ్ముళ్లు.