తూర్పుగోదావరి టీడీపీలో ముసలం... చంద్రబాబుకి షాకిచ్చిన సీనియర్లు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు తూర్పుగోదావరి టూర్ లో ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం కేడర్ లో ధైర్యం నింపేందుకు వచ్చిన చంద్రబాబుకు సీనియర్లు షాకిచ్చారు. సాక్షాత్తూ పార్టీ అధినేత హాజరైన సమీక్షా సమావేశానికే కీలక నేతలు డుమ్మాకొట్టారు. కాకినాడలో చంద్రబాబు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు తదితర ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ముసలం మొదలైందనే చర్చ ఊపందుకుంది. పార్టీ అధినేత సమావేశానికే డుమ్మాకొట్టడం టీడీపీలో కలకలం రేపుతోంది.

ఓటమి భారంతో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయిన నేతలు, కార్యకర్తల్లో ధైర్యం, జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, తూర్పుగోదావరిలో పర్యటిస్తూ కాకినాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. మొదటిరోజు రంపచోడవరం, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ అండ్ రూరల్‌, రాజోలు, గన్నవరం, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల సమీక్ష చేపట్టాయి. అయితే, ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనమైంది.

అయితే, చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా, తోట త్రిమూర్తులు... కాపు నేతలతో సమావేశం నిర్వహించి కలకలం రేపారు. అంతేకాదు తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీడీపీ కాపు నేతలంతా.... బీజేపీలో చేరబోతున్నారంటూ లీకులు వదిలారు. ఆ తర్వాత విజయవాడ బోండా ఉమా నివాసంలో మరోసారి కాపు లీడర్లంతా సమావేశమై కలకలం రేపారు. అప్పుడు కూడా, పలువురు నేతలు పార్టీ మారతారనే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు, సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన సమావేశానికే ముఖ్యనేతలు డుమ్మా కొట్టడం తెలుగుదేశం అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.