ఎస్ఈసీపై ప్రతిపక్షం ఫైర్..

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై సుదీర్ఘ పోరాటం చేసి చివరకు ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ మారి పోయారా? ఇప్పుడు ఆయనలో ఆ పోరాట పటిమ లోపించిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమవేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు కమిషన్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు.  పంచాయతి ఎన్నికలలో అధికార పార్టీ అనేక అక్రమాలక పాల్పడినా,  కమిషన్ ఉదాసీనంగా వ్యవహరిచిందని, అదే విధానం మున్సిపల్,  కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కొనసాగితే మరింత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందని తెలుగు దేశం, కాంగ్రెస్, జనసేన, వామ పక్ష పార్టీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు.
 

తెలుగు దేశం తరపున సమావేశంలో పాల్గొన్నపార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య,ప్రభుత్వం అనేక అవరోధాలు కలిపించినప్పటికీ ఎస్ఈసీ ధైర్యంగా పోరాడి స్థానిక ఎన్నికలు జరిపించడం అభినందనీయం అంటూనే, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిన ఎస్ఈసీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఎస్ఈసీలో వ్యవహార సరళిలో మార్పు వచ్చిందని, గతంలో లాగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలేదని అన్నారు. అయితే, ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నామని, అదే విధంగా హై కోర్టు ఆదేశాలను పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.