ఒక రోజు ముందే పసుపు పండుగ.. మహానాడుకు సర్వం సిద్ధం!
Published on: Thu May 26, 2022 12:51PM
తెలుగుదేశం నాలుగు దశాబ్దాల వేడుకకు సర్వం సిద్ధమైంది. తెలుగుదేశం మహానాడు ఒంగోలు వేదికగా రెండు రోజుల పాటు జరగనుంది. ఏటా జరిగే మహానాడులతో పోలిస్తే ఈ ఏడాది జరిగే మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి కూడా కలిసి వచ్చింది. దీంతో మహానాడును నభూతో అన్న విధంగా నిర్వహించాలని తెలుగుదేశం శ్రేణులు పట్టుదలతో ఉన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడక కళ ఒక రోజు ముందుగానే రానుంది. కారణం తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం మహానాడుకు ఒక రోజు ముందు ఒంగోలులోనే నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు ఒక రోజు ముందే ఒంగోలుకు చేరుకుంటారు. ఈ పొలిట్‌బ్యూరో సమావేశంలో.. మహానాడు అజెండాతో పాటు..రానున్న రోజుల్లో పార్టీ అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేస్తారు.వరుసగా మూడేళ్లు మహానాడుకు భౌతికంగా దూరంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు... ఈసారి పండుగను విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. మూడేళ్ల వైకాపా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. దానిని మహానాడు వేదికగా తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది. మహానాడు నిర్వహణ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్న తెలుగుదేశం..ప్రజా క్షేత్రంలో తమ సత్తా చాటేందుకు.. మహానాడు విజయవంతం చేయడాన్ని సవాలుగా తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు.... ఒకరోజు ముందుగానే ఒంగోలుకు చేరుకుంటారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి అధినేత చంద్రబాబు వెంట భారీ ద్విచక్ర వాహనర్యాలీతో ఒంగోలు వెళ్లేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర నుంచి..భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహానాడు నిర్వహణకు మినీ స్టేడియం అడిగితే అనుమతులు నిరాకరించడం, వాహనాలు ఇవ్వొద్దంటూ ఆర్టీసీ సహా ప్రైవేట్ ట్రావెల్స్, విద్యాసంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం, ఒంగోలులో పసుపు తోరణాల తొలగింపు వంటి పరిణామాలను చంద్రబాబు సహా పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. మహానాడు ప్రారంభం రోజు మాత్రమే.. ఆ ప్రాంతానికి వచ్చే సంస్కృతికి స్వస్తి పలికి.. ఒక రోజు ముందే అక్కడ మకాం వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా..తమ వెంట ప్రజాబలం ఉందని చాటేలా.. వ్యూహరచన చేసుకున్నారు.
మంగళగిరి, కాకాని, గుంటూరు, చిలకలూరిపేట, అద్దంకి క్రాస్‌రోడ్, మేదరమెట్ల, ఒంగోలు పరిసరాల నుంచి కూడా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట తెలుగు తమ్ముళ్లు... బైక్ ర్యాలీలో కలవనున్నారు. మహానాడు కోసం ఒంగోలు సమీపంలోనిమండవవారిపాలెం వద్ద సభావేదిక ముస్తాబవుతోంది. దారి పొడువునా పసుపు తోరణాలు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, బెలూన్లతో ఒంగోలు నగరాన్ని అలంకరించారు.


