"చైతన్య రథం".. టీడీపీ ఈ-పేపర్.. వైసీపీలో వణుకు!
Published on: Tue Jan 11, 2022 4:34PM
కొంతమంది అవినీతి డబ్బుతో పేపర్, టీవీ ఛానెల్ పెట్టినా.. టీడీపీ మాత్రం సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలను, ప్రజలను చైతన్య పరిచేందుకు.. "చైతన్య రథం" పేరుతో తెలుగుదేశంపార్టీ ఈ-పేపర్‌ను ప్రారంభించింది. స్వతంత్రంగా పనిచేసే మీడియాపై వైసీపీ ప్రభుత్వం వేటు వేసిందని.. మీడియా సంస్థలకు కూడా కులముద్ర వేసి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
"తెలుగుదేశం పార్టీకి ఉన్న 70లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా ‘చైతన్య రథం’ ఈ-పేపర్‌ను తీర్చిదిద్దుతాం. ఒక్క క్లిక్‌తో 30 లక్షల మంది పార్టీ శ్రేణులకు ఈ-పేపర్‌ను పంపిస్తాం. నేటి తరం పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు అలవాటు పడ్డారు. ప్రపంచంలో ఏం జరిగిందనే దాని కన్నా.. నా గ్రామంలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. చైతన్య రథం ఈ-పేపర్‌ను లాజికల్‌గా ముందుకు తీసుకెళ్తాం" అని చంద్రబాబు అన్నారు.
"ఏ గ్రామంలో ఏం జరిగింది.. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయనే విషయాలను చైతన్య రథం ద్వారా వెలుగులోకి తీసుకొస్తాం. బాధితులకు టీడీపీ ఏ విధంగా అండగా ఉందనే విషయాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం. జాతీయ, రాష్ట్ర సమాచారం సహా నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా స్థానికంగా వచ్చే వార్తలపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. టీడీపీ ఎవరికీ భయపడేది లేదు.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఆపేది లేదు" అని చంద్రబాబు తేల్చి చెప్పారు.


