పరీక్షల పేరుతో లక్షలాది మంది విద్యార్థులను కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారు
Published on: Sat Jun 20, 2020 3:35PM
కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత పెరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
"ఏపీలో కరోనా విజృంభిస్తోంటే, ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తోంది. పొరుగురాష్ట్రాల్లో ఉన్నత విద్యా పరీక్షలనే రద్దు చేస్తోంటే ఇక్కడ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలెందుకు? వెంటనే పదో తరగతి పరీక్షలను రద్దుచేయాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"కరోనా సామాజికవ్యాప్తి మొదలైన ప్రమాదకరమైన దశలో లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా టెన్త్ పరీక్షలు రద్దుచేయాలి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తమ విద్యార్థులను కాపాడుకునేందుకు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా వ్యవహరించడం తగదు. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ జగన్ గారు మాత్రం తాడేపల్లి గడప కూడా దాటి రావడంలేదు. లక్షలాది మంది విద్యార్థులను మాత్రం పరీక్షల పేరుతో కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారు. తక్షణమే పరీక్షల రద్దు ప్రకటించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం." అని నారా లోకేష్ పేర్కొన్నారు.


