టోపీపై ఉన్న మూడు సింహాలను డీజీపీ తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టారా..? టీడీపీ నేత సూటి ప్రశ్న 

ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తాజాగా చిత్తూర్ జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై దాడి చేసిన వారిని శిక్షించాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖకు బదులుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మరో లేఖ రాస్తూ సాక్ష్యాలు ఉంటే సీల్డ్ కవర్ లో పంపాలని రాసారు. దీనికి సమాధానంగా టీడీపీ నేత పట్టాభిరామ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి డీజీపీని కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. ఒక రాష్ట్ర డీజీపీ మరీ ఇంతలా దిగజారతారా అని అయన నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ.. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? అని పట్టాభి ప్రశ్నించారు. చంద్రబాబుకు లేఖరాసినట్లుగానే ఎంపీ విజయసాయి రెడ్డికి డీజీపీ లేఖ రాయగలరా? అని అయన ప్రశ్నించారు. 

 

ఏపీలోని హిందూ దేవాలయాల పై దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందన్న నిరాధార వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ పై ఎందుకు చర్యలు తీసుకోరు అని అయన సూటిగా ప్రశ్నించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కొడాలి నాని మాట్లాడినా డీజీపీ ఎందుకు స్పందించడంలేదని.. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని చట్టం చెబుతుంటే డీజీపీ ఎందుకు ఆ పని చేయరు? అని అయన ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలోని మూడు సింహాలు మాయమైపోయినట్లు.. మీ టోపీ పైన మూడు సింహాలు మాయం చేసేశారా డీజీపీ గారు.. మీ టోపీపై ఉన్న మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టారా? అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ ఈ సందర్భంగా కోరారు.