అల్లర్లు స్పష్టించేందుకే ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం
Published on: Mon Jan 3, 2022 2:09PM
వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు.గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసం లాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేయవచ్చన్నారు.
దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారని తన లేఖలో తెలిపారు చంద్రబాబు. 2019 జూన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయన్నారు.ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనమన్నారు టీడీపీ అధినేత. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికారపార్టీ గూండాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలను అదుపులోకి తీసుకోవడం మాని.. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని సూచించారు. విగ్రహం ధ్వంసం ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలన్నారు. నేరస్తులపై పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయని తన లేఖలో తెలిపారు చంద్రబాబు.


