ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు!
Published on: Wed Feb 10, 2021 3:24PM
వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోతున్న కొత్త పార్టీ రాజకీయ సెగలు రేపుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ప్లే చేశారు.
ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు చంద్రబాబు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీ పెట్టడంపై స్పందించాలన్నారు. ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య ఇంకా తేల్చ లేదని విమర్శించారు. వివేకా హత్య కేసులో అప్పుడు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు వద్దు అంటున్నారన్నారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. నాడు వివేకా కూతురు... నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


