బాధితులపై అక్రమ కేసులా! డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం  

వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత  టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. 

పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని లేఖలో చంద్రబాబు చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారని తెలిపారు చంద్రబాబు. తమ‌పై కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని  ఆరోపించారు. పోలీసులు
నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డీజీపీ చూస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో చంద్రబాబు రాశారు.