TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ లోకేష్ కు ప్రమోషన్?

Published on: Thu May 15, 2025 5:05PM

కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి. వాటిలో ప్రధానంగా పార్టీలో లోకేష్ కు అత్యంత కీలక పదవిని కట్టబెట్టనున్నారని గట్టిగా వినవస్తున్నది. లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. పార్టీలో అత్యంత నిర్మాణాత్మకమైన, నిర్ణయాత్మకమైన బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  

ఇక లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై కడప మహానాడు వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంత వరకూ బానే ఉంది. పార్టీలో లోకేష్ ప్రమోషన్ సరే.. అయితే అటువంటి ప్రమోషనే లోకేష్ కు ప్రభుత్వంలో కూడా దక్కాల్సి ఉందని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని, కూటమి పరిమితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అటువంటి డిమాండ్ లు చేయవద్దంటూ చంద్రబాబు గట్టిగా మందలించడంతో ఆ డిమాండ్ సద్దుమణిగింది.

అయితే ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఖాయమైన నేపథ్యంలో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో జోరందుకుంటోంది.   మిత్రధర్మం పేరిట లోకేష్ కు ప్రభుత్వంలో  మూడో స్థానంలో ఉంచడం సరికాదన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లోకేష్ కు ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ ఇవ్వకున్నా ఆయన స్థాయికి కానీ, హోదాకు కానీ వచ్చిన నష్టమేదీ లేదు. వాస్తవానికి పార్టీ మొత్తం చంద్రబాబుకు సక్ససర్ లోకేషే అని మక్తకంఠంతో చెబుతోంది. అదే పరిస్థితి ప్రభుత్వంలోనూ ఉండాలనీ, దానిని అధికారికంగా ప్రకటించాలనీ క్యాడర్ కోరుతోంది.