TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిఠాపురం వర్మకు నో చాన్స్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం

Published on: Sun Mar 9, 2025 8:31PM

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం ప్రకటించింది. ముందు నుంచీ అనుకుంటున్న విధంగానే పిఠాపురం వర్మకు చాన్స్ ఇవ్వలేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఇప్పటికే ఒక స్థానానికి జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానానికి ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు. అయితే ఆ ఐదో స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను పార్టీ ఆదివారం (మార్చి 9) అధికారికంగా ప్రకటించింది. 

సామాజిక వర్గాల వారీగా ముగ్గురికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడులను తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీరిలో కావలి గ్రీష్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె.