ఇతర పార్టీలతో టీడీపీ పొత్తు ఖాయమన్న లోకేష్.. ఏ పార్టీలబ్బా?

 

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.