TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెడ్ బుక్ కు కాదు జగన్ బుక్ కే కూటమి సర్కార్ ప్రాధాన్యం!

Published on: Tue Aug 6, 2024 2:04PM

జగన్ ఐదేళ్ల హయాంలో చేసిన తప్పిదాలే ఆయనను అధికారానికి దూరం చేశాయి.  అరాచక పాలన, అస్తవ్యస్థ విధానాలకు తోడు తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలకు దూరం చేయడం. పార్టీ కార్యకర్తలను సైతం పక్కన పెట్టేసి జగన్ తాడెపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయారు. బటన్ లు నొక్కడానికి పరదాల మాటున బయటకు రావడం తప్ప అసలు ప్రజలకు ముఖమే చూపించలేదు. 

ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేసిన తప్పు చేయడం లేదు. అదే విధంగా జగన్ హయాంలో అధికారుల తప్పులను రెడ్ బుక్ లో నోట్ చేసి చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం కూటమి సర్కార్ రెడ్ బుక్ కంటే జగన్ బుక్ కే ప్రాధాన్యత ఇస్తోంది. ఆ బుక్ ప్రకారం నడుచుకోకుండా ఉండాలని జాగ్రత్త పడుతోంది.  జగన్ బుక్ అంటే ప్రజలతో సంబంధాలు లేకపోవడం, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం, తన విధానాలను వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం, అవినీతి, అక్రమాలతో ప్రజా ధనాన్ని దోచుకోవడం. తెలుగుదేశం కూటమి ఆ జగన్ బుక్ ప్రకారం వ్యవహరించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. రాజకీయ కక్ష సాధింపులకు తెలుగు దేశం కూటమి అస్సలు పాల్పడదని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు.

జగన్ హయాంలో నిబంధలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపైనా చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పిన చంద్రబాబు. అదే సమయంలో ప్రజలతో మమేకమై పని చేస్తామని చాటారు. అదే  చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పడమే కాకుండా చేసి చూపుతున్నారు.  

చంద్రబాబు వారానికి ఒకసారి కార్యకర్తలను కలిసే కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యకర్తలు కూడా పార్టీ అధినేత తమకు అందుబాటులో ఉంటున్నారన్న ఆనందం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంత్రులు  నెలకు ఒకసారన్నా తమ జిల్లా కు వెళ్లి కార్యకర్తలతో గడపాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే మంగళగిరి కార్యాలయంలో కార్యకర్తలను మంత్రులు,ఎమ్మెల్యేలు కలసి వారి సమస్యలను తెలుసుకోవాలని,   పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో,కార్యకర్తలలోపట్టు సడలకూడదని సీఎం చెప్పారు. 

 అయితే జగన్ మాత్రం అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తన బుక్ నే తు.చ. తప్పకుండా ఫాలో అవుతున్నారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు ఆయన సెక్యూరిటీ నుంచి అవమానాలే ఎదురౌతున్నాయి. దీంతో జగన్ కు, వైసీపీకీ క్యాడర్ దూరం జరుగుతోంది. పులివెందులలో, తాడేపల్లి ప్యాలెస్ వద్దా కార్యకర్తల నిరసనలే ఇందుకు నిదర్శనం.  అంతే కాకుండా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు వచ్చే వారే కరవయ్యారు. ఆ కారణంగానే పలు చోట్ల ఇప్పటికే వైసీపీ కార్యాలయాలు మూతపడ్డాయి.  కుప్పం మైలవరం లలో  పార్టీ కార్యాలయాలను ఎత్తి వేయడం ఇందుకు నిదర్శనం.

 జగన్ ఐదేళ్ల హయాంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అయినా అధినేతపై విశ్వాసం మాత్రం కోల్పోలేదు. అదే జగన్ అధికారానికి దూరమై నిండా రెండు నెలలు పూర్తయ్యిందో లేదో అప్పడే వైసీపీ కార్యకర్తలు జగన్ పై విశ్వాసం క కోల్పోయారు. పార్టీకి, అధినేతకు దూరం జరుగుతున్నారు. పార్టీ నిలదొక్కుకుంటుందన్న నమ్మకం లేక తమదారి తాము చూసుకుం టున్నారు.