మాజీ స్పీకర్ కోడెలకు షాక్, కొడుకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Published on: Mon Jun 3, 2019 4:42PM

ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. 2014లో కోడెల గెలుపుతో ఆయన కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు జీఎస్టీ బదులు కేఎస్టీ (కోడెల టాక్స్) వసూలు చేసాడని ఆరోపణలున్నాయి. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా జనం జగన్ వద్ద ఈ విషయాన్ని మొరపెట్టుకున్నారు.
గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్‌లో కూడా శివ రామకృష్ణ పలువురు వ్యాపారులను మోసం చేసి రూ.70 కోట్లకు పైగా వెనుకేసుకున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదు చేస్తూ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి నుండి కోడెల శివరామకృష్ణకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఢిల్లీ పోలిసులు సహా ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ కేసులో కోడెల శివరామకృష్ణ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


