చంద్రబాబు వ్యూహాలతో విజయానికి ఆమడ దూరంలో కాంగ్రెస్, తెరాసలు

 

తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారంతో తెలంగాణాలో తెలుగుదేశం దుఖాణం దాదాపు బంద్ అయిపోయినట్లేనని అందరూ భావించారు. రాష్ట్ర విభజన తరువాత ఇక తెలంగాణాలో తెదేపా ఉనికి ఉండబోదని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేకమార్లు అన్నారు. కానీ ఇప్పుడు అదే తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు అదే తెదేపా కాంగ్రెస్, తెరాసలకు దీటుగా గట్టి పోటీ ఇచ్చింది. అందుకు కారణం చంద్రబాబు అనుసరించిన వ్యూహాలు, ఎత్తులు, కృషేనని చెప్పక తప్పదు.

 

ఎన్నికల ప్రకటన వెలువడగానే, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి ప్రత్యర్ధులకు పరీక్ష పెట్టారు. ఆ వెనువెంటనే బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసి, కాంగ్రెస్, తెరాసలు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత, మంచి ప్రజాధారణ గల పవన్ కళ్యాన్ని ముందుకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో వేడి పుట్టించారు. తెలంగాణా వ్యాప్తంగా తన పార్టీ నేతలను, వారి అనుచరులకు మద్దతుగా వరుసపెట్టి ప్రజాగర్జన సభలు నిర్వహిస్తూ, కాంగ్రెస్, తెరాసలపై, ముఖ్యంగా తెలంగాణాలో తనకి ఎదురేలేదనుకొంటున్న కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణులలో సమరోత్సాహం కలిగించి కేసీఆర్ సైతం నివ్వెరపోయేలా చేయగలిగారు.

 

అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదు నగరాన్నిచూపుతూ అది తన కృషి, సమర్ధత, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమని చెప్పుకొని, తమ పార్టీ మాత్రమే తెలంగాణా అభివృద్ధికి కృషి చేసిందని, చేయగలదని గట్టిగా నొక్కి చెపుతూ ప్రజలను ఆకట్టుకొన్నారు. ఇక ప్రచారం కీలక దశకు చేరుకోగానే బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణయ్యే మా పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు స్వయంగా విస్పష్టంగా ప్రకటించడంతో, కాంగ్రెస్, తెరాసలు అంతే దీటుగా ఆయనకు సవాలు విసరలేకపోయాయి. కారణాలు అందరికీ తెలిసినవే!

 

నిన్నటితో తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఇప్పుడు పార్టీల బలాబలాలు ఒకసారి చూసుకొంటే, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ కానీ, తెచ్చిన తెరాస గానీ గుండెల మీద చెయ్యేసుకొని మాకే పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పలేని పరిస్థితి. కారణం తెదేపా-బీజేపీ కూటమి అనూహ్యంగా పుంజుకొని ఆ రెండు పార్టీలకు గట్టి పోటీనీయడమే. కేసీఆర్ దురాశకు పోకుండా ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఇటువంటి దుస్థితి వచ్చేదే కాదేమో. అప్పుడు ఎన్నికలు కాంగ్రెస్-తెరాసలకు పూర్తి అనుకూలంగా ఏకపక్షంగా జరిగి ఉండేవేమో!

 

కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు, ఇంతకాలం సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిన నోటితోనే కేసీఆర్ ఇప్పుడు ఆమె వలననే తెలంగాణా ఏర్పడిందని, థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామన్న నోటితోనే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ఒక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లేనని అర్ధమవుతోంది. మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరడానికి సిద్దం అవుతున్నారని అర్ధమవుతోంది. ఇదే విషయాన్నీ జైపాల్ రెడ్డి కూడా దృవీకరించారు.

 

ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఇంతకాలం తమదే విజయమని చాలా ధీమా ప్రదర్శించిన కాంగ్రెస్, తెరాసలు మాత్రం విజయం సాధించే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. తమకే ఏక పక్షంగా ఓట్లు పడిపోతాయని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, కాంగ్రెస్ నేతలు, తెదేపా ఇచ్చిన గట్టి పోటీ వలన విజయానికి ఆమడ దూరంలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. తెదేపా-బీజేపీలది అనైతిక బందమని ఇంతకాలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్, తెరాసలు ఎన్నికల తరువాత అధికారం కైవసం చేసుకొనేందుకు మళ్ళీ నిసిగ్గుగా చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నారు.