కొడుకు కోసమే కాదు, అల్లుడి కోసం కూడానట!

 

అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం చాలా సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవే సామాన్య ప్రజలకు తెలియని అనేక ఆసక్తికరమయిన విషయాలను తెలియజేస్తుంటాయి. అయితే ప్రస్తుతం మన వ్యవస్థలో డబ్బు, అధికారం చేతిలో ఉంటే అవినీతిపరులు కూడా నీతి సూక్తులు వల్లిస్తూ జనాల చేత జేజేలు పలికించుకోగల సౌలభ్యం ఉంది. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొనేవాళ్ళకంటే, అటువంటి వారినే ఆదర్శప్రాయంగా భావిస్తూ వారి తరపున వాదించేవారే ఎక్కువ ఉన్నారిప్పుడు.

 

ఇక విషయంలోకి వస్తే తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు గానీ ఆ ఆరోపణలు, జరుగుతున్న పరిణామాలను కలిపి చూసినట్లయితే నిప్పులేనిదే పొగ రాదు కదా! అనిపించక మానదు.

 

అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సమైక్యచాంపియన్ గా ఎదిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ లో తెలంగాణా బిల్లుపై తన వాదనలు వినిపించిన తరువాత పదవికీ, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దానిని ముఖ్యమంత్రి ఎన్నడూ గట్టిగా ఖండించకపోవడం చూస్తే ఆయనకి ఆ ఆలోచన ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.

 

సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అతని సోదరుడు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, బొత్ససత్యనారాయణ తదితరులు కిరణ్ సోదరులపై చేసిన పిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు విచారణకు అనుమతించలేదని ప్రశ్నించారు.

 

కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే కాంగ్రెస్ హయంలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయని, అదేవిధంగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా అక్రమాలు కూడా బయటపడటం ఖాయమనే భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేసేందుకు ప్రయత్నిస్తోందని సోమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

 

అయితే ఇంతవరకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజన చేస్తున్నారని వాదిస్తున్నతెదేపా నేతలు ఇప్పుడు వాటికి అదనంగా మరో కొత్త పాయింటు కూడా జోడించినట్లున్నారు. ఏమయినప్పటికీ సోమిరెడ్డి చేస్తున్నతీవ్ర ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే అందులో ఎంతో కొంత నిజముండకపోదని అనిపిస్తుంది.