పయ్యావుల కేసుతో తెదేపాలో రచ్చ

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశంలో ఎంతో లౌక్యంగా రోజులు నెట్టుకొస్తుంటే ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది. ఈ పిటిషనుతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని, ఇది వ్యక్తిగతంగా వేస్తున్న పిటిషను అని ఆయన చెప్పినప్పటికీ, అది పార్టీలో కలకలం రేపింది.

 

తామంతా రెండు ప్రాంతాలలో పార్టీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నతరుణంలో కూడా వెనక్కి తగ్గిన సంగతిని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ కూడా ఇచ్చి సమన్యాయం కోసం అధ్యక్షుడే పోరాడుతున్నవేళ, పయ్యావుల కేశవ్ ఈవిధంగా సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని పార్టీలో తెలంగాణా నేతలు తప్పుపడుతున్నారు. తెదేపా తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

 

రాష్ట్ర విభజనపై స్పష్టమయిన వైఖరి తెలియజేయని కారణంగా రెండు ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెదేపా,ఇప్పుడు నేతల మధ్య మొదలయిన ఈ అంతర్యుద్దంతో ప్రత్యర్ది పార్టీలకి మరో అస్త్రం అందించినట్లవుతుంది. రేపు తెలంగాణా నోట్ శాసనసభకు వచ్చినప్పుడు కూడా తెదేపా ఇదే విధంగా ద్వంద వైఖరి అవలంభిస్తే పార్టీకి తీరని నష్టం జరగడం ఖాయం.