మీడియా మధ్య అడ్డుగోడలు

 

కులాలు, మతాలు మనుషులనే కాదు, రాజకీయ పార్టీలను చివరికి మీడియాను కూడా వేరుచేస్తున్నాయి. లౌకిక వాదం గురించి రాజకీయ పార్టీలు ఎన్ని ధర్మపన్నాలు వల్లించినా అవన్నీ ఏదో ఒక కులానికో లేక మతానికో కొంచెం అధిక ప్రాతినిద్యం వహిస్తున్నసంగతి బహిరంగ రహస్యమే. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది.

 

ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి. రాష్ట్రంలో మీడియా ఈ మూడు పార్టీలలో దేనికో ఒకదానికి కొమ్ము కాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ప్రజలకు కూడా తమకు నచ్చిన రాజకీయ రంగుటద్దాలను పెట్టుకొని తాము అభిమానించే పార్టీకి వత్తాసు పలికేవార్తలను తెలుసుకొనే సౌలభ్యం ఏర్పడింది.

 

వైకాపా అధ్యక్షుడు జగన్, కేసీఆర్ అధ్వర్యంలో నడిచే సాక్షి మరియు టీ-మీడియా సంస్థలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఇటీవల తీసుకొన్న నిర్ణయంతో, ఇప్పుడు మీడియా మధ్య ఉన్న సన్నటి గీతను కూడా చెరిపేసి ఏకంగా అడ్డుగోడలే కట్టేసినట్లయింది.

 

తన ప్రత్యర్ధ పార్టీకి చెందిన మీడియా సంస్థలు తమను అభాసుపాలు చేయడానికి పనిగట్టుకొని తప్పుడు కధనాలు ప్రచురించడమే కాకుండా, సమావేశాలలో ఇబ్బందికర ప్రశ్నలు వేస్తున్నందున సాక్షీ మరియు తెలంగాణా న్యూస్ వంటి వాటిని ఇక ముందు తమ సభలకు సమావేశాలకు దూరంగా ఉంచాలని తెదేపా నిశ్చయించుకొంది. ఆయా పత్రికా విలేఖరులను, ప్రతినిధులను ఇక ముందు తమ సభలకు, సమావేశాలకు అనుమతించబోమని తెదేపా అధికార ప్రతినిధి గాలి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.

 

దీనితో ఇక ఇంతవరకు మీడియా మధ్య జరుగుతున్న ప్రచ్చనంగా జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరి మీడియాను కూడా పూర్తిగా కలుషితం చేస్తుంది.