కుప్పంలో కాంగ్రెస్ కిరణాలు వెలిగేనా?
Published on: Mon Feb 27, 2012 2:20PM
కుప్
పం: తెలుగుదేశం కంచుకోటగా పేరుపడ్డ కుప్పం నియోజకవర్గంలో పాగా వేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నామినేటేడ్ పదవుల పందెరం వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇటీవల రెస్కో ఛైర్మన్ పదవిని తన వర్గీయుడికి కట్టబెట్టగా ఇప్పుడు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవిని కూడా తనవారికే ఇప్పించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రాజకీయంగా ఉనికికోసం తాపత్రయపడుతున్న దివంగత మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు కుమారుడైన డాక్టర్ సురేష్ కు కిరణ్ కుమార్ రెడ్డి చేయూతనిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు జిల్లాలో తన రాజకీయ ప్రత్యర్ధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆయన అనుచరవర్గాన్ని దెబ్బతీయడంతో పాటు నిన్న మొన్నటిదాకా జడ్ పి ఛైర్మన్ గా ఉంటూ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్న సుబ్రహ్మణ్యంరెడ్డి పలుకుబడిని పూర్తిగా తగ్గించడానికి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.


