వాస్తవాన్ని ఒప్పుకున్న మోపిదేవి
Published on: Thu Feb 9, 2012 2:49PM
హైదరాబాద్: తన తనయుడికి ఓ బీర్ కంపెనీ అమ్మకపు హక్కులు ఉన్నాయన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ గురువారం స్పందించారు. ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇన్ బేవ్ పేరుతో బిరు కంపెనీ పెట్టడానికి తాము రిజిస్టర్ చేసిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి బీరు కంపెనీ పెడితే బాగుండదనే ఉద్దేశ్యంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు. బీర్ కంపెనీకి గతంలో రిజిస్టర్ చేశామని, అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు అనుమతులు రాలేదన్నారు. కనీసం లేబుల్ కోసం అనుమతి కూడా రాలేదన్నారు. వ్యాపారం చేసుకునేందుకు రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత విరమించుకున్నప్పటికీ టిడిపి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను ఏ మార్కెట్ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. అలాగే ఏ కంపెనీతోనూ సంబంధం లేదన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య బుధవారం మోపిదేవి వెంకట రమణ తన కుమారుడికి ఒక ప్రముఖ బీర్ కంపెనీ అమ్మకం హక్కులు ఇప్పించుకున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.


