TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐటీ కంపెనీలో లైంగిక వేధింపులు...బలవంతపు మత మార్పిడి!

Published on: Sun Apr 12, 2026 4:09PM

 

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మత మార్పిడికి ప్రేరేపించారనే సంచలన ఆరోపణలు వెలుగులోకి రావడంతో యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులను కంపెనీ తక్షణమే సస్పెండ్ చేసింది.

ఈ వ్యవహారంపై నాసిక్ పోలీసులు ఇప్పటికే గట్టి నిఘా ఉంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురు టీమ్ లీడర్లు సహా ఒక హెచ్ఆర్ (HR) అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ గత కొన్నేళ్లుగా ఈ అకృత్యాలు సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణాలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్యాలయంలో కొందరు సీనియర్ ఉద్యోగులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వారిని గొడ్డు మాంసం తినాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై గతంలోనే అంతర్గత ఫిర్యాదులు చేసినప్పటికీ, అప్పట్లో హెచ్ఆర్ విభాగం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్, ఇది కేవలం వేధింపులకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద రాకెట్ ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

టీసీఎస్ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో వేధింపులకు తావులేదని, ఉద్యోగుల భద్రతే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం సిట్ అధికారులు బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నారు. 

ఈ ఉదంతంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కార్పొరేట్ రంగంలో మహిళా భద్రతపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.