'హిజాబ్' అణచివేతకు చిహ్నం.. తస్లీమా నస్రీన్‌తో మరింత వివాదాస్పదం
Published on: Thu Feb 17, 2022 2:32PM
హిజాబ్ ఆచారం అణచివేతకు చిహ్నమని బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. హిజాబ్ ఆచారాన్నే ఆమె తప్పుపట్టారు. మత విశ్వాసాలు పాటించాల్సింది విద్యా సంస్థల్లో కాదని నస్రీమా అన్నారు. మతం కంటే విద్యే గొప్పదని ఆమె అన్నారు. పురుషుల కళ్లలో మహిళలు పడకుడా ఉండేందుకే 7వ శతాబ్దంలో పెట్టిన దుష్ట ఆచారం హిజాబ్ అని తస్లీమా దుయ్యబట్టారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులను కర్ణాటకలోని ప్రభుత్వ విద్యా సంస్థలు అనుమతించకపోవడం వివాదానికి కారణమైంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ముస్లిం సామాజిక వర్గానికే చెందిన వ్యక్తే అయినప్పటికీ తస్లీమా నస్రీన్ హిజాబ్ ఆచారాన్ని తప్పుపడుతూ స్పందించడం విశేషం. హిజాబ్, బుర్ఖా, నికాబ్ ఇవి అన్నీ కూడా అణచివేతకు చిహ్నాలు అన్నారామె. మత ఆచారాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా యూనిఫాం ధరించాలన్న కర్ణాటక ప్రభుత్వం విధానంపై తస్లీమా స్పందిస్తూ.. ‘హిజాబ్ తప్పనిసరా?’ అని ప్రశ్నించారు. ఈ ఆధునిక 21వ శతాబ్దంలో ఇతరులతో మహిళలు సమానం అని భావిస్తున్నప్పుడు హిజాబ్, నికాబ్, బుర్ఖాలతో పని ఏముందని ప్రశ్నించారు. ‘విద్యా సంస్థలు లౌకిక తత్వంతో ఉంటాయి. డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉండాలి. మతం కంటే విద్య ముఖ్యమైనది. ప్రజలకు మత విశ్వాసాలు ఉండొచ్చు. ఆ విశ్వాసాలను ఇంటి వద్ద కానీ, మరెక్కడైనా కానీ ఆచరించుకోవాలి. లౌకిక విద్యా కేంద్రంలో కాదు’ అని తస్లీమ నస్రీన్ అన్నారు.
‘హిజాబ్ తప్పనిసరి అని కొందరు ముస్లింలు భావిస్తుంటారు. మరి కొందరు తప్పనిసరి కాదనుకుంటారు. కానీ, హిజాబ్ ను 7వ శతాబ్దంలో స్త్రీ ద్వేషి ఎవరో ప్రవేశపెట్టారు. ఆ కాలంలో స్త్రీలను శృంగార వస్తువుగా చూసేవారు. పురుషుడు స్త్రీని చూస్తే.. వారిలో కామోద్దీపనలు కలుగుతాయని భావించేవారు. దాంతో మహిళలు హిజాబ్, బుర్ఖా ధరించాలని పెట్టారు. వీటి ద్వారా పురుషుల కళ్లలో పడకుండా ఉంటారు‘ అని తస్లీమా పేర్కొన్నారు.
తస్లీమా నస్రీన్ అభిప్రాయం ఇలా ఉండగా.. తాజాగా హిజాబ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు కూడా పాకింది. కర్ణాటక విద్యాసంస్థలో జరిగినట్లే విజయవాడలోని లయోలా కాలేజి యాజమాన్యం బుర్కా వేసుకుని వచ్చిన ముస్లిం విద్యార్థినులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఫస్ట్ ఇయర్ నుంచీ తాము కాలేజీకి బుర్కలోనే వస్తున్నామని, కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫొటో దిగామని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు తమను ఆపుతున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
హిజాబ్ వ్యవహారంపై దేశం అంతా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ వివాదం బళ్లారికి కూడా వ్యాపించింది. విద్యార్థినులు తరగతి గదిలోకి హిజాబ్ ధరించి వెళ్లకూడదని సరళాదేవి కాలేజి గేటు వద్ద సిబ్బంది హెచ్చరించారు. గేటు వద్ద సరే అని లోనికి వెళ్లిన విద్యార్థినులు హిజాబ్ తీసేందుకు ససేమిరా అన్నారు. దీంతో వివాదం పెరిగింది. వారిని తరగతి గది నుంచి బయటికి పంపించారు. తమకు విద్య కన్నా ధర్మమే ముఖ్యమని, ఇంటర్నల్ పరీక్ష వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యారు. పరీక్ష వదిలి వెళ్లొద్దని ప్రిన్సిపాల్ వేమన్న వారికి నచ్చజెప్పారు.
మరో పక్కన హిజాబ్ వివాదాన్ని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మరింత రాజేశారు. ‘మీకు మదర్సాలు ఉన్నాయి. అక్కడ మీరు హిజాబ్ వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. హిందూ సమాజం ఉన్న చోట వాటి అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. హిజాబ్ ఇంట్లో వేసుకోండి అంటూ ఓ ఉచిత సలహా కూడా ప్రజ్ఞా ఠాకూర్ ఇచ్చారు. ఇక కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా హిజాబ్ వివాదంపై స్పందించారు. ఏది అవసరమో ఇస్లాం పుస్తకాల్లో స్పష్టంగా తెలిపారని అన్నారు. అర్కాన్ ఇ- ఇస్లిం పేరిట ఉండే ఐదు విషయాలు ఇస్లాంటో తప్పనిసరి అని, వాటిలో హిజాబ్ లేదని స్పష్టం చేశారు. ‘దేవుడిపై విశ్వాసం’, ‘అను నిత్యం ప్రార్ధనలు’, ‘రంజాన్ ఉపవాసాలు’, ‘సేవా కార్యక్రమాలు’, ‘హజ్ యాత్రలు’ ఇస్లాంలో తప్పనిసరి అన్నారాయన. ఖురాన్ లో ‘చదువు’ అంటే కేవలం దేవుడినే స్మరించడం కాదని, జంతువులు, నక్షత్రాలు, ఆకాశం వంటి వాటినీ చర్చించాలని అర్థం అన్నారు. ఏది ఏమైనా హిజాబ్ వివాదం మాత్రం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.


