తక్షణం యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటోన్న తస్లీమా!

 

జల్లికట్టు అనుకూల ఉద్యమాలు హిందూత్వవాదులకి చెంపపెట్టు! భవిష్యత్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని చూస్తే అదే విధంగా బుద్ది చెబుతారు! ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? భారత పార్లమెంట్లో ఎంపీగా వెలిగిపోతోన్న హైద్రాబాదీ వీరుడు అసదుద్దీన్ ఓవైసీ. స్వయంగా బారిష్టర్ చదివిన ఆయన ఇంచుమించూ కోర్టు తీర్పు ఇచ్చినా తాము పట్టించుకోమన్నట్టు మాట్లాడాడు!


ఓవైసీ ఉమ్మడి పౌరస్మృతికి నో చెబితే తాజాగా తస్లీమా నస్రీన్ మాత్రం అర్జెంట్ గా అమల్లోకి తేవాలని కోరింది! ఇస్లామ్ కి వ్యతిరేకంగా తాను రాసిన కవితలు, పుస్తకాల వల్ల ప్రస్తుతం ఆమె మాతృదేశం బంగ్లాదేశ్ ను విడిచి భారత్ లో వుంటోంది. గత ఇరవై ఏళ్లుగా ఇండియా, స్వీడన్, అమెరికా, యూరప్ లలో తస్లీమా తల దాచుకుంటుంది. అందుకు కారణం, ఆమె ఇస్లామ్ ను విమర్శించటమే. ఆ మతంలో వ్యవస్థాగతంగా స్త్రీలపై జరుగుతోన్న అరాచకాన్ని ప్రశ్నించటమే. తస్లీమాపై బంగ్లాదేశ్, ఇండియాల్లోని ఇస్లామిక్ ఛాందసవాదులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఫత్వాలు జారి చేసి ఆమె ప్రాణాలకే ముప్ప తల పెట్టారు. అందుకే ఆమె ఏళ్ల తరబడి విదేశీ ప్రభుత్వాల రక్షణలో సమయం వెళ్లదీస్తోంది.


ప్రస్తుతం జరుగుతోన్న జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో అనూహ్యంగా తస్లీమా ప్రత్యక్షమైంది. ఆమె ఇంటర్వ్యూ గురించి నిర్వాహకులు ఎక్కడా ప్రచారం చేయలేదు. దాని వల్ల ఏ గొడవా లేకుండా తస్లీమా ఇంటర్వ్యూ జరిగింది. అందులో భాగంగా ఆమె భారత్ కి అర్జెంట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమన్నారు. హిందూ స్త్రీలు తప్పనిసరి అయితే స్వేచ్ఛగా తమ భర్తలకి విడాకులు ఇస్తున్నారనీ, ఆస్తిలో కూడా వాటా పొందుతున్నారని, ముస్లిమ్ మహిళలు మాత్రం అలాంటి హక్కులు లేకుండా అణిచివేయబడుతున్నారని ఆమె అన్నారు. ఇస్లామ్ లో ఆడవారి పరిస్థితి మెరుగుపడాల్సి వుందని వ్యాఖ్యానించారు. కాని, అలా జరగటం ముస్లిమ్ మత ఛాందసవాదులకి ఇష్టం లేదన్నారు.


యానిఫామ్ సివిల్ కోడ్ ను సమర్థించిన తస్లీమా నస్రీన్ సెక్యులరిజమ్ పై కూడా కామెంట్స్ చేశారు. ఇస్లామిక్ మత చాందసవాదుల్ని వెనకేసుకు రావటం లౌకికవాదం అనిపించుకోదని ఆమె అన్నారు. ఈ అభిప్రాయాలన్నీ సహజంగానే ముస్లిమ్ నేతలకి, మత గురువులకి కోపం తెప్పిస్తాయి. కాని, తస్లీమా లాంటి అభిప్రాయమే చాలా మంది మితవాద, ఆధునిక ముస్లిమ్ లలో బలంగా వుంది. కాని, దాడులకి భయపడి, ఓటు బ్యాంక్ రాజకీయ నేతల మద్దతు కూడా లభించదనీ వారు మిన్నకుండిపోతున్నారు. 


ప్రస్తుతం సుప్రీమ్ కోర్టులో విచారణలో వున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం త్వరలోనే తేలనుంది. కోర్టు అందరికీ ఒకే చట్టం వర్తించాలని తీర్పునిస్తే పెద్ద రగడే జరిగే అవకాశం వుంది. ఈ సమయంలో తస్లీమా మద్దతు యూనిపామ్ సివిల్ కోడ్ కోరుతున్న వారికి పెద్ద బలంగా మారే అవకాశం వుంది.