ట్రైలరే చూపించాం.. ముందుంది అసలు సినిమా ! కేసీఆర్ పై బీజేపీ జాతీయ నేత సంచలన కామెంట్లు
Published on: Sat Dec 19, 2020 10:07AM
తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ట్రైలర్ మాత్రమే చూపించామని అసలు సినిమా ముందుందన్నారు. టీఆర్‌ఎస్ తో రాజీ ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ తో తాము చేస్తున్నది డూప్‌ఫైట్ కానే కాదని, ఆ పార్టీతో కుస్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిజాం పాలనతోపాటు అవినీతిని అంతమొందించే వరకూ బీజేపీ నిద్ర పోదని తేల్చిచెప్పారు తరుణ్ చుగ్. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏ రాజా సాబ్ కుమారుడో... అల్లుడో, నిజాం చెంచానో సీఎం కాడు.. సామాన్యుడే సీఎం అవుతారంటూ తరుణ్ చుగ్ ఆసక్తికర ప్రకటన చేశారు.
సీఎం కేసీఆర్‌ను రాజాబాబుగా సంబోధించిన తరుణ్ చుగ్ .. ఆయన ఫాంహౌస్ ను ఏడు నక్షత్రాల మహల్‌తో పోల్చారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో తండ్రీకొడుకుల, కొన్ని రాష్ట్రాల్లో తల్లీబిడ్డల పాలన చూశా.. తెలంగాణలో మాత్రం హిందూ అవిభాజ్య కుటుంబ పాలన సాగుతోందని తరుణ్ విమర్శలు చేశారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువుతో కూడిన కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని, ప్రజా ధనాన్ని లూటీ చేయడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారని ఆరోపించారు చుగ్.టీఆర్‌ఎస్, మజ్లిస్ మధ్య డూప్ ఫైట్ నడుస్తోందని, అందుకే ఫలితాలు వెలువడినా మేయర్‌ను ఎన్నుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు.


