TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యామానికి సిద్ధపడుతున్న నిజామాబాద్ పసుపు రైతులు

Published on: Thu Feb 16, 2012 1:43PM

నిజామాబాద్ :నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధరను పెంచకపోతే రోడ్లపై ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మొక్కజొన్న రైతులు కూడా గతంలో గిట్టుబాటు ధరలకోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పటి ఉద్యమం పోలీసుకాల్పుల వరకు వెళ్ళింది. ఈ నేపధ్యంలో పసువు రైతుల ఉద్యమ బెదిరింపులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో పసుపును పండించే జిల్లాలో నిజామాబాద్ దే అగ్రస్థానం. ఈ జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో పసుపును సాగుచేస్తున్నారు. ఏటా సుమారు 6 లక్షల క్వింటాళ్ళ పసుపు ఇక్కడ దిగుబడి అవుతుంది. పసుపు రైతును ఎకరానికి  20 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని, అయితే ఎకరానికి రూ.80 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని, అందువల్ల క్వింటాలుకు రూ.4,500 ధర  నిర్ణయించామని ప్రభుత్వం అంటుంది. అయితే ఈ లెక్కలన్నీ తప్పుల తడకలని, దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్ళు మాత్రమే ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 4,500 గిట్టుబాటు ధర తమకు ఏమాత్రం ఆమోద యోగ్యంకాదని, కనీసం క్వింటాలుకు రూ.15వేలు చెల్లించాలని రైతులు అంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను పెంచకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.