వేయికోట్ల ఎర్రచందనాన్ని దోచుకున్న తమిళ స్మగ్లర్లు
Published on: Thu May 3, 2012 9:54AM
రాష్ట్రంలోని చిత్తూరు, కడప అటవీ ప్రాంతాల్లో ఉన్న అమూల్యమైన ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు అడ్డూఅదుపూ లేకుండా దోచుకు పోతున్నారు. గత ఐదేళ్ళలో వీరు సుమారు వేయికోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ స్మగ్లర్లు బయటకు రాకుండా అమాయకులైన కూలీల ద్వారానే తమ పనిని గుట్టుచప్పుడుకాకుండా పూర్తి చేస్తున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు ఈ అమాయకకూలీలు దొరుకుతున్నారు కానీ, తమిళ స్మగ్లర్ల ఆచూకీ దొరకటం లేదు.
చిత్తూరుజిల్లాలోని పీలేరు, కెబి పల్లి, పాకాల, పుత్తూరు, రొంటిచెర్ల, ఎర్రవాడిపాల్యెం, బంగారు పాల్యెం తదితర ప్రాంతాల నుంచి ఎర్రచందనాన్ని రహస్యంగా తమిళనాడుకు తర లిస్తున్నారు. అక్కడ నుంచి దీన్ని చైనా, జపాన్, థాయ్ ల్యాండ్ వంటి దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్మగ్లర్ల ఆగడాలు మితిమీరిపోతుండటంతో రాష్ట్ర పోలీసులు వీరి ఆటకట్టించటానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే కడప, చిత్తూరు జిల్లాల్లో చెక్ పోస్టులను బలోపేతం చేస్తున్నారు. స్మగ్లింగ్ జరిగే మార్గాలపై గస్తీని పెంచుతున్నారు. నిజానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లింగ్ ను అరికట్ట లేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అనుసరించడమేనని తెలుస్తోంది.


