విశాల్ వెనుక శశికళ.. వారే టార్గెట్..!

 

రోజు రోజుకు తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎప్పుడైతే మరణించారో అప్పటినుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ పోయి ఏడాది అయినా.. ఇంకా అక్కడ సరైన ప్రభుత్వం ఏర్పడలేదు అంటేనే తెలుస్తోంది రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది అక్కడ.

 

జయలలిత మరణానంతరం... ఆమె నియోజక వర్గమైన ఆర్కే నగర్ ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటికే ఈ స్థానం పలువురు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్షాల సంగతేమో కానీ... సొంత పార్టీ నుండే ఈ స్థానానికి పోటీ నెలకొంది. దీంతో ఉపఎన్నిక వార్ చాలా రసవత్తరంగా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పోటీ బరిలో మరో వ్యక్తి కూడా నామినేషన్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అతనెవరో కాదు.. హీరో విశాల్. ఎలాంటి సమాచారం లేకుండా.. చాప కింద నీరులా వచ్చి... ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో విశాల్ పోటీకి దిగాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... విశాల్ సడెన్ పోటీకి దిగడంపైనే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విశాల్ పోటీ వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నారు అంటున్నారు.

 

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరునుకుంటున్నారా..? ఎవరో కాదు... అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ. విశాల్ పోటీ వెనుక శశికళ ఉందన్నది టాక్. విశాల్ పోటీకి, శశికళకు సంబంధం ఏంటా అని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర వాదనలు, విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే... ఆర్కే నగర్ లో తమిళనాట సెటిల్ అయిన తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ప్రజలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీరిని ఆకట్టుకోడానికే అన్నాడీఎంకే తరపున తెలుగు మూలాలు వున్న మధుసూదన్ ని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం రంగంలోకి దించారు. మధుసూదన్ స్థానికుడు కావడంతో పాటు తెలుగు మూలాలు ఉండటమే ఆయనకు ప్లస్ పాయింట్ గా ఆ నేతలు భావించారు. దీనికి కౌంటర్ గా నిజాయితీ గల వాడన్న ఇమేజ్ కలిగిన విశాల్ ని రంగంలోకి దించాలని శశికళ బ్యాచ్ తెర వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపించింది. అంతేకాదు అతని ఆర్ధిక కష్టాలు తీర్చి ఆర్కే నగర్ ఎన్నికల్లో పాల్గొనేలా ఒప్పించినట్టు తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే విశాల్ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. మరి నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఏమో.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.