విశాల్ సవాల్...నా సత్తా చూపిస్తా...


తమిళనాడులో ఆర్కే నగర్ లో జరుగుతున్న ఉపఎన్నికకు ఎవరూ ఊహించని విధంగా నామినేషన్ వేసి విశాల్ అందరకీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇక విశాల్ నామినేషన్ వేసిన తరువాత... విశాల్ వెనుక శశికళ ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక సడెన్ గా నామినేషన్ వేసిన అందరికీ షాకిచ్చిన విశాల్ కు ఈసీ కూడా షాకిచ్చింది. విశాల్ నామినేషన్ ని ఈసీ తిరస్కరించింది. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్ధికి మద్దతుగా 10 మంది స్థానిక ఓటర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అలా విశాల్ నామినేషన్ పత్రాల మీద సంతకం చేసిన ఇద్దరు అది తమ సంతకం కాదని రిటర్నింగ్ అధికారి ముందు చెప్పడంతో విశాల్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు సదరు అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై స్పందించిన విశాల్ ఓ సవాల్ విసిరాడు. ప్రజలకు మేలు చేయాలని భావిస్తే, ఇన్ని సమస్యలు వస్తాయని తాను భావించడం లేదని, సినిమాల్లో వచ్చే ట్విస్టుల్లా ఇవి ఉన్నాయని అన్నాడు. ఓ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేయకూడదా? అని ప్రశ్నించిన ఆయన, ప్రధాన పార్టీలకు తాను సవాల్ గా మారుతానని, తన సత్తా చూపించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఓ యువకుడిని గెలిపిస్తానని, అతని ద్వారా తాను చేయాలనుకున్న మంచి చేస్తానని అన్నాడు. తొలుత తిరస్కరణ, ఆపై ఆమోదం, తిరిగి తిరస్కరణ... జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే, ఈసీపై కూడా ఒత్తిడి ఉన్నట్టు తనకు అనుమానం వస్తోందని చెప్పాడు.