రైతంటే అంత నిర్లక్ష్యమా..

 

రైతు గురించి చెప్పమంటే ఒక రేంజ్ లో ఉపన్యాసాలు ఇస్తుంటారు. రైతు లేనిదే దేశం లేదని.. వాళ్లు లేనిదే మనకు అన్నం లేదని.. అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో డైలాగ్స్ కొడుతుంటారు. కానీ ఇవన్నీ మాటలు మాత్రమే.. రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా పాలకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకే ఆత్మహత్యలు, నిరసనలు. అలా నిరసనలు చేసిన పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తమ ప్రభుత్వం ఏర్పాటుకు కుటిల ప్రయత్నాలు చేసుకునే పనిలోనే ఉన్నారు.. తప్పా గత కొద్ది నెలలుగా నిరసనలు చేస్తున్న తమిళనాడు రైతులు మాత్రం కనిపించడంలేదు.

 

తమిళనాడులో  గతేడాది అత్యల్ఫ వర్షాపాతం నమోదుకావటంతో భారత వాతావరణ శాఖ తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించింది. దీంతో మద్రాస్ హైకోర్టు రైతులందరికీ రుణ మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే రుణ మాఫీకి అర్హులను చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే విధించటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపట్టారు. మార్చి 14 నుంచి 41 రోజులపాటు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేశారు. ఆ తరువాత ఒక నెలరోజులపాటు విరామం ఇచ్చి... ఆతరువాత మళ్లీ నిరసనలు ప్రారంభించారు. అయితే ఈసారి కాస్త విభిన్నంగా... రోజుకో వేషంతో నిరసనలు మొదలుపెట్టారు. అర్ద నగ్న, నగ్న ప్రదర్శన,చనిపోయిన రైతుల పుర్రెలను మెడలో వేసుకొని, లుకలు-పాములు నోట్లో పెట్టుకోని, చీరలు కట్టుకొని ఇలా రోజుకో వేషం వేశారు. ఆఖరికి తమ మలాన్ని తామే తినే పరిస్థితి ఏర్పడింది. తమ మలాన్ని ప్లాస్టిక్‌ బ్యాగుల్లో సేకరించిన రైతులు.. నినాదాలు చేస్తూ తినేశారు. అంతేకాదు మనిషి మాంసం కూడా తింటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ చీమకుట్టినట్టయినా లేదు. వీళ్లపాటికి వీళ్లు నిరసనలు చేసుకుంటూనే వెళుతున్నారు.. వాళ్లపాటికి వాళ్లు చూసుకుంటూ పోతున్నారు తప్పా పరిష్కారం మాత్రం లేదు. ఈ సందర్బంగా రైతుల జాతీయ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను మాట్లాడుతూ... మా నిరసనలు చేపట్టి రేపటికి వంద రోజులు పూర్తవుతుంది... ఆ రోజు పూర్తి నగ్నంగా ప్రధాని కార్యాలయంకు మార్చి నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. ఆఖరికి అన్నం పెట్టే రైతు మలాన్ని తినాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వుం దీనిపై స్పందిస్తుందో..? లేద..? చూద్దాం.