TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడులో ఆరు నెలల్లో ఎన్నికలు...స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Published on: Mon Jun 29, 2026 5:03PM

 

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు.

గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు.

మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.