TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ 570 కోట్లకి బాధ్యత ఎవరిది!

Published on: Tue May 17, 2016 12:28PM

తమిళనాడులో ఒక పక్క ఎన్నికలు జరుగుతుండగా ఏకంగా 570 కోట్ల రూపాయలు పట్టుపడటం సంచలనం సృష్టించింది. ఇవన్నీ ఎన్నికలలో పంచేందుకు ఎవరో ఏర్పరుచుకున్న డబ్బన్న పుకార్లు మొదలయ్యాయి. అలాంటిది ఏమీ లేదనీ, ఈ సొమ్మంతా కూడా తమదేననీ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పడంతో పుకార్ల షికార్లు కాస్త నెమ్మదించాయి. కానీ ఇంత మొత్తం సొమ్ము అంత సులువుగా ఎలా తరలిస్తున్నారన్న ప్రశ్న మొదలైంది. రాత్రి పూట అందునా అడవుల గుండా వందల కోట్ల రూపాయలు వెళ్తున్నాయన్న అనుమానం ఎవరికన్నా వస్తే ఇంకేమన్నా ఉందా! సాదాసీదాగా ఉండే ఎన్నికల కమీషన్‌ అధికారులే ఈ కంటెయినర్లని వెంబడించి పట్టుకోగలిగారంటే, ఇక సాయుధంగా వెంటపడేవారి సంగతి చెప్పేదేముంది. స్టేట్‌ బ్యాంక్‌ మాత్రం ఇలాంటి ఆరోపణలన్నింటినీ కొట్టి పారేస్తోంది.

 

పగలే ప్రయాణించాలన్న నిబంధన ఏదీ లేదని వాదిస్తోంది. కోయంబత్తూరు నుంచి వైజాగు శాఖకు ఈ సొమ్ముని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారనీ, త్వరలోనే ఈ సమస్య తీరిపోతుందనీ అంటోంది. సొమ్ముని తాము పకడ్బందీగానే తరలించామని భుజాలు చరచుకుంటోంది. కానీ ఈ కంటెయినర్లను వెంబడించిన అధికారుల వాదన వేరేలా ఉంది. కంటెయినర్లకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు లుంగీలు కట్టుకుని నిర్లక్ష్యంగా ఉన్నారనీ, బ్యాంకు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారనీ అంటున్నారు. నగదుకి సంబంధించిన ధృవపత్రాలలో కూడా లోపాలు కనిపించడంతో దాన్ని తిరుపూరు కలెక్టరేటు వద్దనే నిలిపివేశారు.

 

570 కోట్లని అలా నిలిపి ఉంచడమంటే, తక్కువలో తక్కువ వడ్డీ వేసుకున్నా రోజుకి లక్షల్లో నష్టం తేల్తోంది. అటు ఎన్నికల కమీషన్‌, ఇటు ఆదాయపు పన్ను అధికారులు తిరుపూర్‌కి చేరుకుని ఆ సొమ్ము సరైనదే అని తేల్చిన తరువాత కానీ, కంటెయినర్లు కదిలే పరిస్థితిలో లేవు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో, వాటిని కాపాడవలసి వ్యవస్థలు ఎంత ఆషామాషీగా వ్యవహరిస్తున్నాయో బయటపడిపోతోంది. ఏమైనా మనది కాని మంది సొమ్మంటే అందరికీ చులకనే కదా!