TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ తో చర్చలు.. ఇస్లామాబాద్ కు అమెరికా ప్రత్యేక ప్రతినిథుల బృందం

Published on: Sat Apr 25, 2026 9:27AM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అగ్రరాజ్యం అమెరికా  కీలక ముందడుగు వేసింది. ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు తన ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని పాకిస్థాన్‌ పంపాలని నిర్ణయించారు.  ఇస్లామాబాద్ వేదికగా జరిగే  ఈ చర్చల లక్ష్యం ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చడమే.  

అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ  ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ  అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది. గతంలో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఈసారి ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులను రంగంలోకి దింపడం   ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొద్ది కాలంగా ఇరాన్,  అమెరికా మధ్య సముద్ర మార్గాల్లో ఆంక్షలు, డ్రోన్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ట్రంప్ అంగీకరించడం శుభపరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఇలా ఉండగా.. ఇరాన్ కూడా ఈ చర్చల పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. అయితే.. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధనంపై ఇరాన్  ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.