తలసాని పర్యటనతో దుర్గ గుడిలో ఆంక్షలు

 

ఏపీ పర్యటనలో టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని అన్నారు. తమతో పాటు ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించనని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తలసాని రాజకీయాలు మాట్లాడటంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయటంతో దుర్గగుడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయనాయకుల పర్యటనపై ఆంక్షలు విధించారు ఈవో కోటేశ్వరమ్మ. ఇకపై దుర్గగుడికి వచ్చే రాజకీయ నాయకుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆలయానికి నేతలు, వారి అనుచరులను సమూహ ప్రవేశాన్ని గుడిలోకి పంపవద్దని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయ, వ్యాపార, వ్యక్తిగత పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మ వారి ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడకుండా వెళ్లిపోవాలని దుర్గగుడి అధికారులు కోరుతున్నారు. ఈ కొత్త నిర్ణయాలను అమలు చేయాలని ఈవో కోటేశ్వరమ్మ ఆదేశాలు జారీ చేశారు.