కళంకిత సభా సమావేశాలు

 

ఒకప్పుడు ఎవరినయినా కోర్టులు తప్పుబడితే అది చాల అవమానకరంగా భావించేవారు. అటువంటి వారిపట్ల ప్రజలకి, ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉండేది. ఇక సదరు వ్యక్తులు కూడా తీవ్ర ఆత్మన్యునతకి గురయి స్వచ్చందంగా రాజీనామా చేసి తమ పదవుల నుండి తప్పుకొనేవారు. అందువల్ల, అందరికీ సమాజమంటే కొంత భయం కూడా ఉండేది. ఇదంతా ఒకనాటి మాట. నేడు దీనికి పూర్తి వ్యతిరేఖ పరిస్థితులు దాపురించాయి.

 

శాసన సభలో సాక్షాత్ ముఖ్యమంత్రే కళంకిత మంత్రులను, శాసనసభ్యులను వెనకేసుకు వస్తూంటే, సదరు వ్యక్తులు తమపై వచ్చిన నేరారోపణలకు సిగ్గుపడకపోగా తమని ప్రశ్నించినవారిపై ఎదురుదాడికి పాల్పడటం విశేషం. ఈ రోజు శాసన సభలో కళంకిత మంత్రులపై తెదేపా లేవదీసిన చర్చకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ధీటుగా జవాబిచ్చారు. తన పరిశీలనలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలు కనబడ్డాయని, అయినప్పటికీ చంద్రబాబు, నాటి రెవెన్యూ శాఖ మంత్రిగా అశోక్ గజపతి ఎన్నడూ తప్పు చేసినట్లు భావించలేదని, కోర్టుకు వెళ్లి బెయిలు కూడా తెచ్చుకొని నిర్భయంగా నిర్లజ్జగా తిరుగుతూ ఇప్పుడు తనని ప్రశ్నించడం ఏమిటని ఆయన నిలదీశారు.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెదేపాకు బదులిస్తూ రాజీనామాలు చేసినంత మాత్రాన్న మంత్రులను నేరస్తులుగా పరిగణించలేమని, గతంలో తెదేపా మంత్రులపై కూడా అనేక నేరారోపణలు వస్తే వారంతా బెయిలు పొంది హాయిగా తిరుగుతున్నపుడు, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన తన మంత్రులను ఎందుకు తప్పు పట్టాలి? అని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రే స్వయంగా కళంకిత మంత్రులకు బాసటగా నిలవడం ఒక తప్పయితే, ఎదుట వాడు తప్పు చేసాడు గనుక తాము కూడా తప్పు చేసినా తప్పులేదని వాదించడం మరో తప్పు.

 

ఇది ఒక దుసంప్రదాయంగా మారి నేరస్తులే ప్రజలను పరిపాలించే అవకాశం కల్పిస్తుంది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఒకసారి విలువలు దిగజార్చుకోవడం మొదలుపెడితే ఇక సమాజం అధః పాతాళానికి జారడం ఖాయం. సమాజంలో ఇప్పటికే నేర ప్రవృతి పెరిగిపోయింది. దానికి ఈ విధంగా ప్రభుత్వం కూడా సహకరిస్తే అది మరింత పెరిగి తుదకు ఏదో ఒకనాడు అది సమాజాన్నే కబళించక మానదు.