పార్ధ సారధి రాజీనామాకై ప్రతిపక్షాల వృధాప్రయాస

 

ధర్మాన, సబితల రాజీనామాలు చేసామని చెప్పినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ, దృవీకరించే స్థితిలో లేరు. అసలు వారు నేటికీ మంత్రులుగా కొనసాగుతున్నారా లేక మాజీలుగా మారారా? అనే సంగతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వంలో అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదంటూ హూకరించే కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ విషయంలో నోరు మెదపడానికి భయపడుతున్నారు.

 

అయినా కూడా ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీకూడా మిగిలిన నలుగురు మంత్రుల వెంటపడటం మానుకోలేదు. కళంకిత మంత్రుల రాజీనామాల కోసం పట్టుబడుతున్న తెదేపా కూడా తన హాయంలో జైలులో ఉన్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చింది గనుక, ఆటోమేటిక్ గా ఆ పార్టీకి నైతిక హక్కులు క్యాన్సిల్ అయిపోయినట్లేనని ఆయన ఏదో ఆల్జీబ్రా సిద్ధాంతం ప్రకారం శలవిచ్చారు.

 

ఇక తను పదవిలో కొనసాగాలా వద్దా? అనేది కాంగ్రెస్ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకొంటారని, అందువల్ల ప్రతిపక్షాల వారు తన రాజీనామా విషయమై శ్రమ పడటం వృధాయని ఆయన సూచించారు. ఇక, తన సంస్థపై ఉన్న ఫెరా ఉల్లంఘన కేసు గురించి తానూ 2004 ఎన్నికల ఎఫిడవిట్ లో సమర్పించానని, కానీ 2009 ఎన్నికల సమయానికి తానూ ఆ సంస్థ డైరెక్టర్ పదవి నుండి తప్పుకొనందువల్లనే తానూ 2009 ఎన్నికల ఎఫిడవిట్ లో పేర్కొనలేదని, ఈ విషయం తెలుసుకోకుండా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వారిపై విరుచుకు పడ్డారు.

 

ఆయన ఒకవేళ ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి తన పదవికి రాజీనామా చేస్తే, దానిని కూడా ఆయన కంటే ముందుగా రాజీనామాలు చేసిన ఇద్దరు మంత్రుల రాజీనామాల పత్రాల క్రిందనే పెట్టక తప్పదు గనుక ప్రతిపక్షాలు ఆయన వెంట పడటం మానుకొంటేనే మేలు.