కేసీఆర్‌ రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిది

 

టీడీపీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘాటు లేఖ రాశారు.కేసీఆర్‌ అమూల్యమైన నాలుగున్నరేళ్ల కాలాన్ని పరిపాలన చేతకాక వృథా చేశారని దేవేందర్‌గౌడ్‌ ధ్వజమెత్తారు.పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, సమర్థమైన యువత అందుబాటులో ఉన్నా పెట్టుబడులు ఆహ్వానించటంలో విఫలం అయ్యారని విమర్శించారు.బంగారు తెలంగాణ పేరుతో అనైతిక పనులకు పాల్పడ్డారని ఆరోపించారు.సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. మనం ప్రజస్వామ్యంలో ఉన్నామా?, రాచరికంలో ఉన్నామా? అర్థం కానీ పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు.కనీసం మంత్రులకు సైతం కేసీఆర్‌ దర్శన భాగ్యం దొరకడంలేదని విమర్శించారు.కేసీఆర్ భాష, ప్రవర్తనతో తెలంగాణకు మాయని మచ్చ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కులాల పేరుతో విభజించు- పాలించు సూత్రాన్ని అమలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇప్పటికైనా రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణలో మరో ఉద్యమం రాకుండా నివారించినవారవుతారని స్పష్టం చేశారు. మిత్రమా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు దేవేందర్‌గౌడ్‌ లేఖలో పేర్కొన్నారు.