సుబ్బిరామిరెడ్డిని బాబు నేరుగా విమర్శించలేరా?
Published on: Sat Jun 9, 2012 2:07PM
తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి అన్న పేరు వినగానే ఓ పారిశ్రామికవేత్త, ఓ సినీనిర్మాత, ఓ రాజకీయపార్టీ నేత అన్న మూడు విభిన్న కోణాలు ఒకేసారి ఆవిష్కృతమవుతాయి. అంతేకాకుండా కళాబంధు బిరుదును ఆయన పొందారు. దీంతో ఎంతటి నేతలైనా ఆయనకు గౌరవమిస్తూనే వచ్చారు. అదేమీ చిత్రమో అందరినీ విమర్శలతో చెలరేగేసిన నాయకులు కూడా ఆయన ముందు గౌరవంగానే ఉంటారు. అటువంటి ఇబ్బందే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. సుబ్బిరామిరెడ్డి పేరును ఉచ్చరించకుండా ఆయన కంపెనీ పేరు ఉదాహరిస్తూ బాబు విమర్శనాస్త్రాలను వదిలేశారు. బాబు మాటలను గమనిస్తే అందరినీ వ్యక్తిగతంగా విమర్శించి సుబ్బిరామిరెడ్డికి మాత్రం మినహాయింపు ఇచ్చారని అనిపిస్తోంది. అక్రమ సొమ్ముతో ఇక్కడ ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మేకపాటి, ఆనం సోదరులు నెల్లూరు జిల్లాను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెఎంసి, గాయత్రి కన్ స్ట్రక్షన్స్ (సుబ్బిరామిరెడ్డి కంపెనీ) నాసిరకం పనులు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటుకు రెండు వేలు, మూడు వేలు ఎంతడిగితే ఆనతిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారని బాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నాలుగులైన్లలో మేకపాటి, ఆనం సోదరులను నేరుగా విమర్శించిన బాబుకు సుబ్బిరామిరెడ్డిపై సాఫ్ట్ కార్నర్ ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. లేకపోతే తమ నేత విమర్శ పదును తగ్గించటమేమిటని వారు తిరిగి ప్రశ్నిస్తున్నారు.


