టీ-నోట్ సిద్దం, విభజన ఖాయం, హైదరాబాద్ అయోమయం

 

తెలంగాణా నోట్ దాదాపు సిద్దం అయిపోయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల తమను కలిసిన సీమాంధ్ర నేతలు శైలజానాద్ తదితరులకు తెలియజేసారు. ప్రభుత్వోద్యోగుల నియమాకాలు, పదోన్నతులు తదితర అంశాలతో ముడిపడిఉన్నఆర్టికల్ 371 (డీ)ని రాష్ట్ర విభజన చేస్తున్నసందర్భంగా కొనసాగించాలా లేక రద్దు చేయవచ్చా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ సంగతి కూడా తేలిపోతే టీ-నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపేందుకు తాము సిద్దంగా ఉన్నామని వారు తెలియజేసారు.

 

అయితే హైదరాబాదు అంశంపై వారు ఎటువంటి సంకేతం కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. దానిపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొంటుందని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను కూడా తమ శాఖ పరిగణనలోనికి తీసుకొన్నట్లు వారు తెలిపారు.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ చాలా పట్టుదలతో ఉన్నందున, సమైక్య ఉద్యమాలు ఎంత తీవ్ర తరం అవుతున్నపటికీ, రాష్ట్ర విభజనపై ఇక కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఎంత మాత్రం లేదని, అందువల్ల వీలయినంత వేగంగా విభజన ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. మరి దీనికి ఏపీయన్జీవోలు, ప్రజలు, రాజకీయ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.