అంతః కలహాలతో టీ-కాంగ్రెస్ బిజీబిజీ

 

చింత చచ్చినా పులుపు చావదన్నట్లుంది టీ-కాంగ్రెస్ పార్టీ నేతల పద్ధతి. తమ అధిష్టానం సీమాంద్రాలో పార్టీని బలిపెట్టుకొని మరీ తెలంగాణా ఇచ్చినా కూడా ఎన్నికలలో గెలవలేకపోయారు. వారికి టికెట్లు, పదవులపై ఉన్న శ్రద్ధ పార్టీని గెలిపించుకోవడంపై లేకపోవడంతో ఓటమిపాలయ్యారు. పోనీ ఓడిపోయిన తరువాతయినా జరిగిన దానికి పశ్చాతాపపడ్డారా? అంటే అదీ లేదు. మళ్ళీ యధాప్రకారం పార్టీ పదవుల కోసం నిసిగ్గుగా కుమ్ములాడుకొంటున్నారు. పీసీసీ అధ్యక్షపదవి చేజిక్కించుకొన్న పొన్నాల లక్ష్మయ్యను ఎలాగయినా ఆ కుర్చీలో నుండి దింపి అందులో తాము కూర్చోవాలని చాలా మంది టీ-కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం టీ-పీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్.కే. అమోస్ తన పదవికి రాజీనామా చేసి పొన్నాలను కూడా దిగిపొమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఇక మరో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో యుద్ధం చేస్తూ క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఎన్నికలలో పార్టీ ఓటమికి కారణమయిన పొన్నాలతో బాటు అతను కూడా స్వచ్చందంగా పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా టీ-కాంగ్రెస్ నేతలు తమ సహచరులతో పోరాటం చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటే, మరి కొందరు డిల్లీ వెళ్లి టీ-పీసీసీని సమూలంగా ప్రక్షాళన చేయాలని, ముఖ్యంగా పొన్నాలను ఆ పదవి నుండి వెంటనే తప్పించాలని కోరగా, కాంగ్రెస్ అధిష్టానం వారి అభ్యర్ధనను తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ, ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా పార్టీ పదవుల కోసం పోరాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి తాము సరయిన నిర్ణయమే తీసుకొన్నామని తెలంగాణా ప్రజలు భావిస్తే తప్పులేదు. అదేవిధంగాటీ-కాంగ్రెస్ నేతలు తమ జోలికి రాకుండా వారిలో వారే ఈవిధంగా పదవుల కోసం కలహించుకొంటూ కాలక్షేపం చేస్తుండటంతో, అధికార తెరాస పార్టీ కూడా రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి నిమగ్నం చేయగలుగుతోంది.